తెలంగాణ పోలీసు శాఖలో భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాలు

తెలంగాణ పోలీసు శాఖలో భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాలు 




18 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 22 వేలు
త్వరలో ప్రకటన
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకానికి రంగం సిద్ధమవుతోంది. 18 వేల పోలీసు పోస్టుల భర్తీకి ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 22 వేల ఉద్యోగాల నియామకానికి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
శాంతిభద్రతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. పోలీసుశాఖకు భారీగా నిధులు కేటాయించడంతోపాటు ఉద్యోగాల భర్తీలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 వేల కానిస్టేబుల్‌, ఎస్సై నియామకాలు చేపట్టింది. మరోమారు భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ విభాగాల్లో భర్తీ చేసే 18 వేల ఉద్యోగాల్లో వెయ్యి దాకా ఎస్సై కొలువులు ఉండే అవకాశం ఉంది. వీటికి అదనంగా ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీఎఫ్‌)లో సుమారు వెయ్యి, అగ్నిమాపక శాఖ, జైళ్లు, ఆర్టీసీలలో సుమారు మూడువేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా తెలంగాణ పోలీసు నియామక మండలే చేపట్టనుంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించే ప్రక్రియ మొదలైంది. స్వల్ప మార్పులు మినహా నియామక ప్రక్రియ గతంలో మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్‌ చివరినాటికి లేదా మే మొదటి వారంలో ఉద్యోగ ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.

Comments